Chandrababu: విశాఖపట్నంలో భూములన్నీ కొనేశారు: చంద్రబాబు ఆరోపణలు

  • వీళ్ల రియల్ ఎస్టేట్ కోసం రాజధానిని మార్చుతున్నారు
  • అమరావతిని నాశనం చేస్తుంటే చూస్తు ఊరుకోవాలా? 
  • ఒక రాజధానికి కూడా డబ్బుల్లేవన్నారు?
  • మరి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారు?  

రాజధానిని మార్చడం లేదని ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ... 'వీళ్ల రియల్ ఎస్టేట్ కోసం రాజధానిని మార్చుతున్నారు. విశాఖపట్నంలో భూములన్నీ కొనేశారు. అమరావతిని నాశనం చేస్తుంటే చూస్తు ఊరుకోవాలా?' అని ప్రశ్నించారు.

'ఒక రాజధానికి కూడా డబ్బుల్లేవన్నారు? మరి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారు? జీఎన్ రావు నివేదిక రాక ముందు అసెంబ్లీలో మూడు రాజధానులు వస్తాయని ప్రకటించారు. బీసీజీ నివేదిక రాక ముందే.. ఆ నివేదికలో ఏం వస్తాయో మంత్రులు చెబుతున్నారు' అని చంద్రబాబు నాయుడు అన్నారు.

'ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటో కూడా వైసీపీ నేతలకు తెలియదు. దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ లబ్ధికోసమే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీకు చేతనైతే, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోండి చూద్దాం' అని చంద్రబాబు సవాలు విసిరారు.

'జాతీయ మీడియా వారు ఏపీ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారు. ఇక్కడి రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి ముంపునకు గురయ్యే అవకాశం లేదు. అయినప్పటికీ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

More Telugu News