Andhra Pradesh: ఏపీ రాజధానిపై బీజేపీ వైఖరి ఇదే... ఎలాంటి మార్పులేదు: కన్నా స్పష్టీకరణ

  • మీడియా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కన్నా
  • అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆకాంక్ష
  • చంద్రబాబు తమను దోషిగా నిలబెట్టాడని ఆరోపణ

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ఏపీ విషయంలో సీడ్ క్యాపిటల్ ఒకేచోట ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలని మాత్రమే బీజేపీ కోరుకుందని వెల్లడించారు.అవకాశం ఇస్తే అమరావతిలో మంచి రాజధాని నిర్మిస్తామని తాము  2019 ఎన్నికల  మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నామని, ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నామని, అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.

తాము కోరుకున్నది అభివృద్ధి వికేంద్రీకరణ తప్ప పరిపాలనా వికేంద్రీకరణ కాదని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ జగన్ ప్రభుత్వం తీసుకున్న పిచ్చి నిర్ణయం అని కొట్టిపారేశారు. వైసీపీ పాలన యావత్తు అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యంతో నడుస్తోందని విమర్శించారు. రాజధాని అని పేరుపెట్టి అభివృద్ధి కోసమేనని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారడం ఎక్కడా చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇక చంద్రబాబుపైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తమతో ఉంటూనే తమను దోషిగా నిలబెట్టాడని, 2014 నుంచి 2019 వరకు ఏపీ బీజేపీకి చీకటిరోజులని కన్నా పేర్కొన్నారు. నిజమేంటో తెలిసిన రోజున ప్రజలు బీజేపీతోనే ఉంటారని ధీమాగా చెప్పారు. స్థానిక బీజేపీ నేతలు భిన్నస్వరాలు వినిపిస్తుండడం పట్ల స్పందిస్తూ, ఏపీ బీజేపీ నేతల నిర్ణయంతో కేంద్ర నాయకత్వ నిర్ణయంగా భావించరాదని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్ర బీజేపీ వ్యతిరేకిస్తుందని, దీనికి బీజేపీ అధినాయకత్వంతో సంబంధంలేదని స్పష్టం చేశారు. ఏపీలో రాజధాని మార్పు నిర్ణయం జరిగితే మాత్రం బీజేపీ చూస్తూ ఊరుకోదని అన్నారు.

ప్రజాధనం పట్ల చంద్రబాబుకు కానీ, జగన్ కు కానీ జవాబుదారీతనం ఉన్నట్టు కనిపించడంలేదని, ఏమాత్రం బాధ్యత ఉన్నా ప్రజాధనం దుర్వినియోగం చేయరని అభిప్రాయపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ల సొంత జాగీరులా వ్యవహరించడం తప్ప, ఇదో రాష్ట్రం, దీన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన వీరికి ఏమాత్రం లేదని విమర్శించారు.

More Telugu News