matrimonial sites: మాట్రిమోనియల్ సైట్లపై కేంద్ర హోంశాఖ హెచ్చరికలు.. పలు సూచనలు!

  • పెళ్లి సంబంధాల సైట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు
  • పలు సూచనలు చేసిన ‘సైబర్ దోస్త్’
  • వ్యక్తిగత వివరాలను సైట్లలో నమోదు చేయొద్దు

మాట్రిమోనియల్ సైట్లను ఆసరాగా చేసుకుని నేరగాళ్లు చెలరేగిపోతుండడంపై కేంద్రం హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. పెళ్లి సంబంధాల సైట్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఆ శాఖ సైబర్ సేఫ్టీ విభాగానికి చెందిన ట్విట్టర్ ఖాతా ‘సైబర్ దోస్త్’ద్వారా పలు సూచనలు చేసింది. మాట్రిమోనియల్ సైట్లలో రిజిస్ట్రేషన్ కోసం వ్యక్తిగత ఈ-మెయిల్ అడ్రస్ ఇవ్వవద్దని, ప్రత్యేక ఈ-మెయిల్ వాడాలని సూచించింది. అలాగే, ఫొటో, ఫోన్ నంబరు వంటి వ్యక్తిగత వివరాలను సైట్లలో పెట్టవద్దని కోరింది. వీటిని ఇవ్వడం ద్వారా నేరగాళ్లు చెలరేగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పెళ్లి సంబంధాల విషయంలో అటువైపు వ్యక్తులను కలిసే ముందు బంధుమిత్రులు వెంట ఉండేలా చూసుకోవాలని సూచించింది.

మాట్రిమోనియల్ సైట్లను ఆశ్రయించే ముందు వాటి రివ్యూలు, రేటింగ్‌లను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించింది. అలాగే, ఆ సైట్ విశ్వసనీయతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. స్నేహితులు, బంధువులను విచారించడం ద్వారా ఆ సైట్ విశ్వసనీయతను తెలుసుకోవాలని సూచించింది. అంతేకాక, వీలైతే ఆ సైట్ ద్వారా ఒక్కటైన జంటలను కలిసి మరింత సమాచారాన్ని సేకరించాకే ముందడుగు వేయాలని పేర్కొంది.

More Telugu News