BJP MP Aravindh comments on Asaduddin owaisi: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంఐఎం నడిపిస్తోంది: బీజేపీ ఎంపీ అరవింద్

  • సీఎం కేసీఆర్ కు అసదుద్దీన్ ఒవైసీ పెద్దకొడుకుగా మారాడని ఎద్దేవా
  • ‘జనగణమన’ పాడని అసదుద్దీన్ సెక్యులరిజంపై మాట్లాడటం తగదు
  • మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎంలకు ప్రజలు బుద్ధి చెబుతారు

సీఏఏ, ఎన్నార్సీలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదని.. వాటి అమలు కచ్చితంగా జరుగుతుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ చెప్పారు. వీటిని కాంగ్రెస్, ఎంఐఎంలు  ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ఎన్నార్సీపై రాజకీయం చేస్తోందన్నారు. నిజామాబాద్ లో అరవింద్ మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంఐఎం నడిపిస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కు అసదుద్దీన్ ఒవైసీ పెద్దకొడుకుగా మారాడని ఎద్దేవా చేశారు.

తన పూర్వీకుల వివరాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే అసదుద్దీన్ ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే.. నిజామాబాద్ లో ఎంఐఎం సభ పెట్టిందన్నారు. ‘జనగణమన’ పాడని అసదుద్దీన్ సెక్యులరిజంపై మాట్లాడటం తగదని ధ్వజమెత్తారు. అభివృద్ధిని చూసి మైనారిటీలు ఓటు వేయాలని సూచించారు. మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎంలకు ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పారు.  

మైనారిటీలు నివసించే ప్రాంతాల్లో పర్యటించొద్దంటున్నారు

నిజామాబాద్ లో ముస్లిం మైనారిటీలు నివసించే ప్రాంతాల్లో కనీస మౌలిక సౌకర్యాలు కూడా లేవని అరవింద్ ఆక్షేపించారు. ఆ ప్రాంతాల్లో తాను పర్యటించాలనుకుంటే.. పోలీసులు వద్దని చెబుతున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘ఈ దేశం ఎటు పోతుందో.. ఎంపీకే రక్షణ ఇవ్వలేకపోతే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నట్లు?’ అని మండిపడ్డారు.

More Telugu News