Sujana Chowdary: 15 సార్లు బొత్సకు సవాల్ విసిరా... కేసు పెట్టరు.. నిరూపణ చేయరు: సుజనా చౌదరి

  • అమరావతిలో నాలాంటి వారికి భూములున్నాయని అంటున్నారు
  • ఇంతవరకు ఒక అంగుళం భూమిని కూడా చూపించలేకపోయారు
  • రాజకీయ విద్వేషాలతోనే మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు

ప్రజల మనోభావాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మండిపడ్డారు. కాసేపటి క్రితం హైదరాబాదులో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో తనలాంటి వారికి భూములు ఉన్నాయని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని... తనకు ఒక అంగుళం స్థలం ఉన్నా చూపించాలని ఇప్పటికి 15 సార్లు మంత్రి బొత్సకు, ప్రభుత్వానికి సవాల్ విసిరానని చెప్పారు. ఇంతవరకు ఒక అంగుళం భూమిని కూడా చూపించలేదని, కేసు కూడా పెట్టరని, ఆరోపణలను నిరూపించరని... కానీ, చులకనగా వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపేస్తున్నారని మండిపడ్డారు.

కేవలం రాజకీయ విద్వేషాలతోనే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని సుజనా చౌదరి ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికే చెడ్డ పేరు వస్తోందని అన్నారు. పీపీఏ, రివర్స్ టెండరింగ్ వల్ల జరిగే నష్టాలను కూలంకుషంగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయాలన్నింటినీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని... మళ్లీ ఢిల్లీలో ఆయనను కలిసి నివేదిక ఇస్తామని తెలిపారు.

More Telugu News