రైలు ప్రయాణికురాలి మెడలో గొలుసు తెంపి పారిపోయిన దుండగులు

26-12-2019 Thu 11:57
  • విశాఖ ఎక్స్ ప్రెస్ లో పిడుగురాళ్ల వద్ద ఘటన 
  • రైలు ఆగిన సమయంలో కిటికీ వద్ద కూర్చున్న మహిళ 
  • ప్రయాణికులు కేకలు వేసినా ప్రయోజనం శూన్యం 

రైలులో కిటికీ వద్ద కూర్చున్న ఓ ప్రయాణికురాలి మెడలోని గొలుసును గుర్తు తెలియని దుండగులు తెంపి పరారైన ఘటన ఇది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వద్ద నిన్నరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

 వివరాల్లోకి వెళితే...సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్‌కు వెళ్లే విశాఖ ఎక్స్ ప్రెస్ బుధవారం రాత్రి పిడుగురాళ్ల స్టేషన్‌కు వచ్చి ఆగింది. ఆ సమయంలో అన్నవరానికి చెందిన స్వాతి లక్ష్మి అనే మహిళ కిటికీ వద్ద కూర్చుని ఉంది. నిద్రమత్తులో ఉన్న ఆమె మెడలోని గొలుసును దుండగులు తెంపారు.

దీన్ని గమనించిన బాధితురాలితోపాటు, తోటి ప్రయాణికులు గట్టిగా కేకలు వేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే దుండగులు పరారయ్యారు. ఫ్లాట్ ఫారానికి అటువైపున ఈ ఘటన చోటు చేసుకోవడంతో దుండగులు తప్పించుకుని కాసేపటికే చీకటిలో కలిసిపోయారు. సమాచారం అందుకున్న నడికుడి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.