వ్యక్తిగత స్వార్థం వదలి దేశం కోసం నవ్వుతూ పనిచేయాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

25-12-2019 Wed 19:06
  • ధర్మ విజయం ఉత్కృష్టమైనది  
  • సంఘ్ కార్యకర్తలు ఎల్లప్పుడూ దేశ విజయాన్ని కోరుకుంటారు
  • రజస్సు, తమస్సు శక్తులపై సాత్విక శక్తులు విజయం సాధించాల్సి ఉంది

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ఆర్ఎస్ఎస్ సార్వజనికోత్సవ సభ కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయ్ సంకల్ప్ పేర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వయం సేవకులు పథసంచలన్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగిస్తూ. సంఘ్ కార్యకర్తలు ఎల్లప్పుడూ దేశ విజయాన్ని కోరుకుంటారన్నారు. వ్యక్తిగత స్వార్థం విడనాడి దేశంకోసం నవ్వుతూ పనిచేయాలని సంఘ్ సేవలకు పిలుపునిచ్చారు. ధర్మ విజయం ఉత్కృష్టమైనదిగా భగవత్ పేర్కొన్నారు. ఇందులో వ్యక్తులు కష్టపడుతూ ఇతరుల కష్టాలను తీరుస్తారని వివరించారు. ఆర్ఎస్ఎస్ ఈ తరహా విధానాలతో ముందుకు సాగుతోందన్నారు.

రజస్సు, తమస్సు శక్తులపై సాత్విక శక్తుల విజయం సాధించాల్సి ఉందన్నారు. వ్యక్తి, మానవ సమాజం, సృష్టి కలుపుకొని అందరి సంతోషంకోసం కృషిచేసేదే అసలైన ధర్మమని అన్నారు. ఈ ధర్మంతో సర్వత్రా శాంతి ఏర్పడుతుందన్నారు. ఇది భగవంతుని వైపు నడిపిస్తుందని చెప్పారు. ఇదే భగవద్గీతలో చెప్పబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు రాంమాధవ్, లక్ష్మణ్, మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి తదితరలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పద్మశ్రీ బివిఆర్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.