Delhi court a Petition filed: ఆడదానిగా మారిపోతున్నా.. కేసును కొట్టేయండి: ఢిల్లీ కోర్టులో నిందితుడి అభ్యర్థన

  • చిన్నప్పటినుంచి స్త్రీగా ఊహించుకున్నా
  • స్త్రీలపై మోహం లేదంటూ వెల్లడి
  • ఫిర్యాదు చేసిన మహిళని మొదటి నుంచీ సోదరిగానే భావించా

మూడేళ్ల క్రితం తన సహోద్యోగి వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళ  పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు కోర్టుముందుకు వెళ్లింది. పలుమార్లు  వాద ప్రతివాదనలు జరుగుతూ కేసు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో కేసును కొట్టేయాలంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తాజాగా కోర్టులో పిటిషన్ వేశాడు.

‘ఆడదానిగా మారిపోతున్నాను. చిన్నతనం నుంచీ నన్ను నేను స్త్రీగా ఊహించుకున్నా. నాకు స్త్రీలపై ఎటువంటి మోహం లేదు. కాబట్టి నాపై ఉన్నఈ కేసును కొట్టేయండి’ అని పిటిషన్ లో అభ్యర్థించాడు. బాధితురాలితో రాజీ కుదుర్చుకుంటానన్నాడు.

విచారణ కోసం అతడు స్త్రీల దుస్తులు ధరించి కోర్టుకు హాజరు కావడం గమనార్హం. చిన్నప్పటి నుంచీ తనని తాను స్త్రీగానే భావించుకున్నానని, ప్రస్తుతం తాను పూర్తి స్త్రీగా మారే క్రమంలో ఉన్నానని కోర్టుకు తెలిపాడు. తనపై ఫిర్యాదు చేసిన మహిళని మొదటి నుంచీ ఓ సోదరిగానే భావించానని తెలుపుతూ.. తనపై ఉన్న వేధింపుల కేసును కొట్టేయాలని కోరాడు.  

ఈ సందర్భంగా కోర్టులోనే ఉన్న బాధితురాలు.. అతడి వాదనలను తోసిపుచ్చింది. రాజీపడే ఉద్దేశం లేదంటూ.. విచారణ కొనసాగించి నిందితుడికి తగిన శిక్ష విధించాలని కోర్టును అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో కోర్టు నిందితుడి వాదనను తోసిపుచ్చుతూ..  అతడి పిటిషన్ ను కొట్టివేసింది.

More Telugu News