ఇండియాకు ఉల్లిపాయలు ఆపేసిన టర్కీ... మళ్లీ బెంబేలెత్తించనున్న ధర!

25-12-2019 Wed 11:03
  • సగం ఉల్లి దిగుమతి టర్కీ నుంచే
  • టర్కీలో పెరిగిపోయిన ధరలు
  • ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేసిన టర్కీ

డిసెంబర్ 15 వరకూ ఆకాశాన్ని అంటిన ఉల్లిపాయల ధర, ఇప్పుడిప్పుడే కాస్తంత దిగి వచ్చి, సామాన్యులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే, ఆ ఆనందం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలేలా ఉంది. మరో వారంలో ఉల్లి దరలు 15 శాతం వరకూ పెరగవచ్చని సమాచారం.

ఇండియాలో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి పంట చేతికి రాకపోగా, ఓ దశలో కిలో ఉల్లి ధర రూ. 190 వరకూ చేరిన సంగతి తెలిసిందే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా, ఉల్లి అధికంగా పండే టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాల నుంచి కేంద్రం పెద్దఎత్తున దిగుమతులు చేపట్టింది. ఈ సంవత్సరం ఇప్పటివరకూ 7,070 టన్నుల ఉల్లిపాయలు దిగుమతి కాగా, అందులో 50 శాతం టర్కీ నుంచే వచ్చాయి.

ఇండియాలో ఉన్న డిమాండ్ ను అందుకునేందుకు అమితాసక్తి చూపి, వేల టన్నుల ఉల్లిని ఎగుమతి చేయడంతో, అక్కడ కొరత ఏర్పడి, ఉల్లి ధరలు సామాన్య ప్రజలకు అందకుండా పోయాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తడంతో ఇండియాకు ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆ దేశం నిర్ణయించినట్టు సమాచారం. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడనుందని నాసిక్ హోల్ సేల్ వ్యాపారులు అంటున్నారు.

జనవరి నెలాఖరుకు గానీ, దేశవాళీ ఉల్లిపాయల పంట మార్కెట్లోకి రాదు. దీంతో ఈలోగా ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఫిబ్రవరిలో ఒకేసారి మార్కెట్లోకి ఉల్లి ఇబ్బడిముబ్బడిగా వచ్చి, ధరలు దిగివస్తాయని, అప్పటివరకూ భారం భరించాల్సిందేనని వ్యాపారులు అంటున్నారు.