జగన్ పాలన బాగుంటుందని అనుకున్నా!: సీపీఐ నారాయణ

25-12-2019 Wed 10:06
  • గత ప్రభుత్వ తరహాలోనే జగన్ ప్రభుత్వం కూడా నడుస్తోంది
  • వచ్చిన అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకోవాలి
  • లేకపోతే రానున్న రోజుల్లో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది

టీడీపీ పాలన కక్ష సాధింపులతో నడుస్తోందని గతంలో వైసీపీ ఆరోపించిందని... కానీ, ఇప్పుడు జగన్ కూడా అదే తరహాలో పాలిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జగన్ పాలన బాగుంటుందని గతంలో తాను భావించానని... కానీ, ప్రస్తుత పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు.

జగన్ కు ఎంతో భవిష్యత్తు ఉందని... వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం మాదిరే పాలిస్తామంటే... రానున్న రోజుల్లో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే... వారి ఆలోచనల మేరకు అధికారులు పని చేస్తారని నారాయణ చెప్పారు. గత ఎన్నికలకు ముందు టీడీపీని అణగదొక్కేందుకు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి బీజేపీ ప్రభుత్వం సీఎస్ పదవిని కట్టబెట్టలేదా? అని ప్రశ్నించారు.