విజయసాయిరెడ్డిపై సుజనా చౌదరి ఫైర్

24-12-2019 Tue 21:01
  • జైలుకు వెళ్లొచ్చిన విజయసాయి నాపై ఆరోపణలు చేస్తారా?
  • నా ప్రతిష్టను దిగజార్చేందుకు చిల్లర ప్రయత్నాలు
  • దేశంలో ఏ పౌరుడైనా రాష్ట్రపతికి అర్జీ పెట్టుకోవచ్చు

రాష్ట్రపతికి తనపై ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డిపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు  చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఏ పౌరుడైనా రాష్ట్రపతికి అర్జీ పెట్టుకుంటే దానిని సంబంధిత శాఖకు పంపిస్తారని, అందులో భాగంగానే విజయసాయిరెడ్డి ఫిర్యాదు లేఖను పంపించారని అన్నారు.

రాష్ట్రపతికి రాసిన లేఖకు వచ్చిన ఎకనాలెడ్జ్ మెంట్ ను పట్టుకుని తన ప్రతిష్టను దిగజార్చడానికి విజయసాయిరెడ్డి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. జైల్లో ఊచలు లెక్కబెట్టిన విజయసాయిరెడ్డి తనపై ఆరోపణలు చేస్తూ గత సెప్టెంబరు 26వ తేదీన రాష్ట్రపతికి లేఖ రాస్తే, దాదాపు నెలన్నర రోజుల తర్వాత, అంటే, నవంబరు 6న దీనిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాష్ట్రపతి కార్యాలయం ఫార్వర్డ్ చేసిందని అన్నారు.