Amaravathi: రాజధాని అమరావతి సమస్య పెద్దది కాకముందే సీఎం పరిష్కరించాలి: టీజీ వెంకటేశ్ డిమాండ్

  • రాజధానిగా అమరావతే కావాలంటే ఫ్రీజోన్ గా ఎందుకు పెట్టలేదు?
  • సచివాలయం పూర్తిగా విశాఖలోనే అంటే కుదరదు
  • కర్నూలులో మినీ సచివాలయం ఏర్పాటు చేయాలి

ఏపీ రాజధాని అమరావతి సమస్య పెద్దది కాకముందే సీఎం జగన్ పరిష్కరించాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే మూడు ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని చెప్పిన ఆయన, మూడు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వకుంటే మళ్లీ ఉద్యమాలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కొన్ని డిమాండ్లు చేయడంతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాజధానిగా అమరావతే కావాలంటే ఫ్రీజోన్ గా ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. సచివాలయం పూర్తిగా విశాఖపట్టణంలోనే అంటే ఒప్పుకోమని, కర్నూలులో మినీ సచివాలయం ఏర్పాటు చేసే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాయలసీమ ప్రజలకు విశాఖ వెళ్లాలంటే చాలా ఇబ్బంది అని చెప్పారు. మూడు ప్రాంతాల్లో మినీ సచివాలయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, మూడు ప్రాంతాలకు లాభం చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాయలసీమలో శీతాకాల రాజధాని కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని చెప్పారు.

More Telugu News