వెనుకబడ్డ రాయలసీమలో మరింత వెనుకబడింది రాయచోటి: సీఎం జగన్

24-12-2019 Tue 15:41
  • వైఎస్ హయాంలో రాయచోటిని అభివృద్ధి చేశారు
  • ఆ తర్వాత వచ్చిన సీఎంలు రాయచోటిని పట్టించుకోలేదు
  • ‘నేను ఉన్నాను..’ అంటూ మాట ఇచ్చాను నిలబెట్టుకుంటున్నా

వెనుకబడ్డ రాయలసీమలో మరింత వెనుకబడిన ప్రాంతం రాయచోటి,  తాగునీరు, సాగునీరు కోసం అల్లాడుతున్న నియోజకవర్గం ఇది అని సీఎం జగన్ అన్నారు. రాయచోటిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాయచోటిని అభివృద్ధి చేశారని, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులలో ఈ నియోజకవర్గాన్ని పట్టించుకున్న వారే లేరని విమర్శించారు.

‘నేను ఉన్నాను..’ అంటూ మాట ఇచ్చానని, ఆ మాట ప్రకారం రాయచోటిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే రాయచోటి అభివృద్ధికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. హంద్రీ నీవా ద్వారా రాయచోటి, వేంపల్లి మండలాలకు.. జీఎన్ఎస్ఎస్, హంద్రీ నీవాలను అనుసంధానించడం ద్వారా తంబళ్లపల్లి, మదనపల్లె, పుంగనూరు, కుప్పంలకు ప్రయోజనం చేకూరుతుందని, కాలేటివాగు రిజర్వాయర్ ను 1.2 టీఎంసీలకు పెంచుతున్నామని చెప్పారు. రాయచోటిలోని పీహెచ్ సీని వంద పడకల ఆసుపత్రిగా  మారుస్తున్నామని, అందుకోసం రూ.20 కోట్లు కేటాయించామని, పట్టణాభివృద్ధి కోసం రూ.340 కోట్లు ఖర్చు చేస్తున్నామని, రూ.11 కోట్లతో గ్రామ సచివాలయాల భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

కాగా, రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపనలు చేశారు. సాగునీరు, తాగునీరు, మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్స్, పాలిటెక్నిక్ కాలేజ్, పోలీస్ కార్యాలయాలతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.