పెరిగిన రైల్వే ఆహార పదార్ధాల ధరలు.. కొత్త రేట్లు ఇవిగో!

24-12-2019 Tue 12:27
  • ఇటీవల ధరలను పెంచిన ఐఆర్సీటీసీ
  • కొత్త ధరల వివరాలు స్టాక్ ఎక్స్చేంజ్ లకు
  • నాణ్యత, శుభ్రత కోసమేనని వెల్లడి

ఇటీవల రైళ్లలో ఆహార పదార్థాల ధరలను పెంచిన ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్), ఈ ఉదయం కొత్త రేట్లను తెలుపుతూ స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు సమాచారాన్ని ఇచ్చింది. తాము ప్రామాణిక ధరలను మార్చామని, జనాహార్, రిఫ్రెష్ మెంట్ రూమ్స్ వంటి వాటికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. ధరల పెంపు ద్వారా ఆహారం నాణ్యత పెరుగుతుందని, శుభ్రత, నాణ్యతపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తామని వెల్లడించింది. ఈ ధరలన్నీ జీఎస్టీతో కలిసి గణించినట్టు తెలిపింది.

కాగా, కొత్త ధరల ప్రకారం, శాకాహార అల్పాహారం రూ. 35, మాంసాహార అల్పాహారం రూ. 45, శాకాహార భోజనం రూ. 70, భోజనం (కోడి గుడ్డు కూరతో) రూ. 80, మాంసాహార భోజనం (కోడి మాంసం కూరతో) రూ. 120గా ఉండనుంది. ఇక వెజిటబుల్ బిర్యానీ (350 గ్రాములు) రూ. 70, ఎగ్ బిర్యానీ రూ. 80, చికెన్ బిర్యానీ రూ. 100, స్నాక్ మీల్స్ (350 గ్రాములు) రూ. 50గా ఉంటుందని ఐఆర్సీటీసీ వెల్లడించింది.