కేంద్రానికి వ్యతిరేకంగా జర్మన్ విద్యార్థి నిరసన... దేశం నుంచి వెళ్లగొట్టిన ఇమిగ్రేషన్ అధికారులు!

24-12-2019 Tue 11:47
  • చెన్నైలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న జాకబ్
  • తక్షణమే ఇండియాను వదిలి వెళ్లకుంటే బహిష్కరణేనని హెచ్చరిక
  • చేసేదేమీ లేక వెళ్లిపోయిన జాకబ్

కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న జర్మనీకి చెందిన విద్యార్థిని అధికారులు దేశం నుంచి వెళ్లగొట్టారు. మద్రాస్ ఐఐటీలో భౌతికశాస్త్రంలో పీజీ చేస్తున్న జాకబ్ లిండెంతల్ అనే విద్యార్థి, గత వారంలో నిరసనల్లో పాల్గొనగా, అతని చర్యలు వీసా నిబంధనలను ఉల్లంఘించినట్టేనని, తనంతట తానుగా ఇండియాను వదిలి వెళ్లకుంటే, దేశ బహిష్కరణ చేయాల్సి వస్తుందని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు హెచ్చరించారు. ఇండియాను విడిచి వెళ్లేందుకు సోమవారం వరకూ సమయం ఇచ్చారు. దీంతో చేసేదేమీ లేక సోమవారం మధ్యాహ్నం చెన్నై నుంచి బయలుదేరి ఆమ్ స్టర్ డామ్ కు వెళ్లిపోయాడు జాకబ్.

ఆపై తన బహిష్కరణపై స్పందించిన జాకబ్, సీఏఏపై తాను ఎలాంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయలేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చాడు. తన మిత్రులతో కలిసి చెపాక్‌, వల్లవర్‌ కొట్టమ్ ప్రాంతాలకు వెళ్లానని, ఇండియా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదని అన్నాడు. తనకు పడ్డ శిక్షపై న్యాయ నిపుణులను సంప్రదించి ముందుకెళ్తానని చెప్పాడు. ఇక జాకబ్ బహిష్కరణపై మద్రాస్‌ ఐఐటీ ఇంకా స్పందించలేదు.