మందు కొట్టడం మానేశాను: శృంగార తార సోనా

24-12-2019 Tue 10:25
  • కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన సోనా
  • సినిమాలు వదిలేసి ఎక్కడికో వెళ్లిందని పుకార్లు
  • మీడియాకు వివరణ ఇస్తూ, ప్రకటన విడుదల

పలు భాషల్లో శృంగార తారగా నటించి, కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన సోనా, తాను ఇప్పుడు మందు కొట్టడం పూర్తిగా మానేశానని అంటోంది. డేరింగ్ లేడీ అన్న పేరు తెచ్చుకున్న సోనా, గతంలో ఎన్నో మార్లు పొగ, మద్యం తాగుతూ కనిపించింది. తరచూ ఏదో వివాదాల్లో నిలుస్తూ ఉండేది.

ఇటీవల కొంత కాలంగా ఆమె ఎక్కడా కనిపించక పోవడంతో, నటన మానేసిందని, ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్లిందన్న ప్రచారమూ తెరపైకి వచ్చింది. గత సంవత్సరం ప్రశాంత్ హీరోగా నటించిన 'జానీ' తరువాత మరో సినిమాలో సోనా కనిపించక పోవడంతో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి.

ఇక తనపై ప్రచారంలో ఉన్న పుకార్లకు తెరపెట్టాలన్న ఉద్దేశంతో, మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది సోనా. తనపై నిరాధార ప్రచారం జరుగుతోందని, తాను ఎక్కడికీ వెళ్లలేదని, నటించడాన్ని వదిలి పెట్టలేదని స్పష్టం చేసింది. ఈ సంవత్సరం ఇప్పటికే నాలుగు చిత్రాల్లో నటించానని, మరో 12 సినిమాల ఆఫర్లను తిరస్కరించానని చెప్పింది.

తనకు ఇప్పుడు డబ్బుల కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని, జీవితాన్ని ప్రశాంతంగా గడపటమే లక్ష్యమని చెప్పింది. గతంలో మాదిరి తాను అపరిపక్వతతో లేనని, చాలా పరిణతి చెందానని, మద్యపానాన్ని వదిలేశానని అంది. 2020లో తనకు మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నట్టు ఈ ప్రకటనలో సోనీ అభిప్రాయపడింది.