అప్పుడే ధరలు పెంచేసిన కియా మోటార్స్!

23-12-2019 Mon 21:03
  • సెల్టోస్ మోడల్ పై ధర పెంపు
  • ఆగస్టులో సెల్టోస్ ను తీసుకువచ్చిన కియా
  • ప్రారంభ ధర రూ.9.69 లక్షలు

కొరియాకు చెందిన కియా మోటార్స్ భారత మార్కెట్ పై కన్నేసి ఇక్కడి నుంచే తమ కార్లను ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే. ఏపీలోని పెనుకొండ ప్లాంట్ ఆ విధంగా ఏర్పాటైనదే. ఇటీవలే సెల్టోస్ కారును తీసుకువచ్చిన కియా ఆ మోడల్ పై ధర పెంచేసింది. కియా మోటార్స్ ఆగస్టులో సెల్టోస్ ప్రవేశపెట్టింది. ఇది పెనుకొండలో తయారైన మోడల్. విడుదల సమయంలో దీని ప్రారంభ ధర రూ.9.69 లక్షలు కాగా, దీంట్లో హైఎండ్ మోడల్ ధర 16.99 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పుడా రేట్లను పెంచుతున్నట్టు కియా మోటార్స్ ప్రకటించింది. ఇదే విషయాన్ని డీలర్లకు లేఖ ద్వారా తెలియజేసింది.

ఇప్పటికే కార్లు బుక్ చేసుకున్న వినియోగదారులపై కంపెనీ వర్గాలు స్పష్టతనిచ్చాయి. కారు అందుకునేందుకు డిసెంబరు 31 లోపు గడువు పొందినవాళ్లకు పాత ధరలే వర్తిస్తాయని, వచ్చే ఏడాది కారు అందుకునేవారికి మాత్రం పెంపు తప్పదని కియా పేర్కొంది.