మూడు నెలల పాపాయిని ఎత్తుకుని 'నేను నీకు పాలివ్వలేను' అంటూ బరాక్ ఒబామా జోక్... వీడియో ఇదిగో!

23-12-2019 Mon 11:04
  • హవాయి రాష్ట్రంలో పర్యటించిన ఒబామా
  • గోల్ఫ్ కోర్సులో కనిపించిన మూడు నెలల పాపాయి
  • వైరల్ అవుతున్న వీడియో

ఎల్లప్పుడూ తన మోముపై చిరునవ్వును చెరగనివ్వని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, పదవిని వీడినా, ప్రజల మనసుల్లో నుంచి మాత్రం ఇంకా చెరగిపోలేదు. తాజాగా ఆయన హవాయి రాష్ట్రంలోని కనైలి ప్రాంతంలో ఉన్న ఓ గోల్ఫ్ కోర్సుకు వెళ్లిన వేళ, తీసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఓ తల్లి, తన బిడ్డను ఆడిస్తుండగా, ఆమెను చూసిన ఒబామా, పాపను ఎత్తుకున్నారు. ఎవరీ పాప? అంటూ అడిగారు. పాపాయి వయసెంతని అడుగగా, ఆ తల్లి మూడు నెలలని బదులిచ్చింది. ఒబామా హాయ్ చెప్పగా, పాప తల్లి... 'హాయ్ చెప్పు' అంటుండగా, ఆ చిన్నారి చెయ్యి పైకి లేచింది.

వెంటనే ఒబామా, "ఆమె చేతులు ఊపుతోంది" అంటూ, "నేను నీకు పాలివ్వలేను" (ఐ కాంట్ ఫీడ్ యూ బేబీ) అని జోకేశారు. ఆపై పాప నుదిటిపై ప్రేమగా చుంబించారు. మాజీ అధ్యక్షుడి చర్యతో పాపాయి తల్లి టిఫానీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఈ వీడియోను తీశారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.