నా పేరుపై బినామీ ఉన్నట్టు నిరూపించినా సరే, దేనికైనా సిద్ధమే: బుగ్గనకు ప్రత్తిపాటి సవాల్

22-12-2019 Sun 18:28
  • నాడు వైసీపీ పుస్తకంలో నాకు 198 ఎకరాలు ఉన్నాయి!
  • మంత్రి బుగ్గన మాత్రం 38 ఎకరాలు ఉన్నాయన్నారు!
  • ఈ ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే

ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుకు భూముులు ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ప్రత్తిపాటి మరోమారు ఖండించారు. రాజధాని ప్రాంతం మందడంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను ఆయన కలిశారు. అనంతరం, ప్రత్తిపాటి మాట్లాడుతూ, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలు ఓ పుస్తకాన్ని ప్రచురించారని, తనకు 198 ఎకరాలు ఉన్నాయంటూ అందులో రాశారు, తనకు 38 ఎకరాలు ఉన్నట్టు మొన్న అసెంబ్లీలో అదే పార్టీ ఎమ్మెల్యే ఆరోపించారని మండిపడ్డారు. అమరావతిలో తనకు మూడు గజాల భూమి ఉన్నట్టు చూపించినా సరే, ఏ శిక్షకు అయినా సిద్ధపడతాను లేకపోతే బుగ్గన రాజీనామా చేస్తాడా? అంటూ సవాల్ విసిరారు. తన పేరుపై ఎవరో సురేశ్ అనే బినామీ ఉన్నారని ఆరోపిస్తున్నారని, కనీసం, ఇదైనా నిరూపిస్తే, దేనికైనా సిద్ధమేనంటూ బుగ్గనకు ఛాలెంజ్ విసిరారు.