Tamil Nadu: మద్యం తాగినందుకు థియేటర్‌లోకి పంపించని సిబ్బంది.. బాంబు ఉందంటూ పోలీసులకు ఫోన్!

  • చెన్నైలో విజయవాడ యువకుడి అరెస్ట్
  • సినిమా చూడనివ్వలేదన్న కోపంతోనే ఫోన్ కాల్
  • మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడి పట్టివేత

సినిమా హాలులో బాంబు ఉందని బెదిరించిన కేసులో విజయవాడకు చెందిన శీనుబాబు (24)ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. విల్లివాక్కంలోని ప్రముఖ థియేటర్‌లో బాంబు ఉన్నట్టు ఈ నెల 8న పోలీస్ కంట్రోల్ రూముకు బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో థియేటర్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. బాంబు లేదని తేలడంతో అది ఫేక్ కాల్ అని తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా శీనుబాబు అనే యువకుడు ఈ పనికి పాల్పడినట్టు తేలింది. దీంతో తాజాగా అతడిని అరెస్ట్ చేశారు.

ఓ ప్రైవేటు సంస్థలో ఇంటర్వ్యూ కోసం తాను చెన్నై వచ్చినట్టు చెప్పిన శీనుబాబు.. స్నేహితుడితో కలిసి మద్యం తాగినట్టు చెప్పాడు. అనంతరం సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లగా మద్యం తాగి ఉన్నామన్న కారణంతో తమను లోపలికి అనుమతించలేదన్నాడు. దీంతో థియేటర్‌పై కక్ష తీర్చుకోవాలన్న కోపంతో పోలీస్ కంట్రోల్ రూముకు ఫోన్ చేసి బాంబు ఉన్నట్టు చెప్పామని శీనుబాబు పోలీసులకు తెలిపారు. మొబైల్ నంబరు ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News