టీటీడీ డైరీని చూసిన భక్తుల్లో తీవ్ర అసంతృప్తి!

22-12-2019 Sun 08:47
  • శ్రీవారి డైరీలకు ఎంతో డిమాండ్
  • పేజీల్లో కనిపించని తిధులు, శుభ గడియలు
  • క్వాలిటీ తగ్గిపోయిందని భక్తుల ఆగ్రహం

తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించే శ్రీవారి క్యాలెండర్, డైరీలకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరమూ అందుబాటులో ఉంచే డైరీలు, క్యాలెండర్ల సంఖ్యా పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం డైరీలను చూసిన భక్తులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీటిని చౌకబారు నాణ్యతతో ముద్రించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డైరీలో పంచాంగం వివరాలు ముద్రించలేదని,  శ్రీవారి చిత్రాలు, శ్లోకాలు కూడా మాయమయ్యాయని వాపోతున్నారు.

వాస్తవానికి బయట లభించే ఇతర డైరీలతో పోలిస్తే, టీటీడీలో శుభ ఘడియలు, గోవిందనామ కీర్తనలు ఉంటాయి. ప్రతి పేజీలోనూ తిథులు, నక్షత్ర వివరాలు, యమగండం, శుభలగ్నం, రాహుకాలం వంటివన్నీ ఉంటాయి. గోవింద నామాలు, భగవద్గీత సూక్తులు కనిపిస్తాయి. ఈ సంవత్సరం డైరీలో తిథులూ లేవు. క్వాలిటీ కూడా బాగాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో టీటీడీ ఇంకా స్పందించలేదు.