'జార్జిరెడ్డి' చిత్రానికి అరుదైన ఘనత

21-12-2019 Sat 22:03
  • అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక
  • నేడు, రేపు ఢిల్లీలో ప్రదర్శన
  • హాజరుకానున్న చిత్రబృందం

దశాబ్దాల కిందట హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో తనదైన ముద్రవేసిన జార్జిరెడ్డి అనే విద్యార్థి నాయకుడి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'జార్జిరెడ్డి'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమాకు అరుదైన ఘనత లభించింది. ఈ బయోపిక్ తరహా చిత్రం 'ఫోర్త్ లేక్ వ్యూ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం'లో ప్రదర్శనకు ఎంపికైంది. డిసెంబరు 22, 23 తేదీల్లో 'జార్జిరెడ్డి' చిత్రాన్ని నోయిడా, ఢిల్లీలలో ప్రదర్శించనున్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్ కు 'జార్జిరెడ్డి' చిత్ర యూనిట్ సభ్యులు కూడా హాజరుకానున్నారు. ఈ చిత్రంలో జార్జిరెడ్డిగా సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషించారు. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు.