cm: సీఎం జగన్ నిర్ణయం ఒక వర్గానికో, ప్రాంతానికో అనుకూలం కాదు: మంత్రి కొడాలి నాని 

  • అమరావతిలోనే అన్నీ ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు
  • రాయలసీమ, ఉత్తరాంధ్రలు ఏమైపోయినా ఫర్వాలేదా?
  • చంద్రబాబు బాటలోనే పవన్ కల్యాణ్ నడుస్తున్నారు

ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనని సీఎం జగన్ ప్రకటించిన కాసేపటికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కనీసం ఇతర ప్రాంతాల్లోని తమ నేతలతో కూడా మాట్లాడకుండా విమర్శలు చేశారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతి ప్రాంతంలోనే అన్నీ ఉండాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారని, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏమైపోయినా ఫర్వాలేదని అనుకుంటున్నారని మండిపడ్డారు. తన హయాంలో రాజధానిగా అమరావతిని ప్రకటించాను కనుక అదే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో చంద్రబాబు బాటలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా నడుస్తున్నారని విమర్శించారు.

ఒక వర్గానికో, ప్రాంతానికో అనుకూలంగా జగన్ నిర్ణయం తీసుకోలేదని, అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఆ నిర్ణయానికి వైసీపీ, ప్రజానీకం మద్దతు పలుకుతారని అన్నారు.

ఏపీకి మూడు రాజధానులపై సీఎం చెప్పిన నిర్ణయమే ‘ఫైనల్’ అనుకుంటే కనుక కమిటీని ఎందుకు వేస్తారని ఓ ప్రశ్నకు బదులుగా అన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తామని, అదేసమయంలో, ప్రభుత్వానికి వచ్చే ఫీడ్ బ్యాక్ ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

More Telugu News