Andhra Pradesh: అమరావతి ప్రాంత అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి!: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ఆలోచనను సమర్థిస్తాం
  • అమరావతిని అసెంబ్లీ, కౌన్సిల్ కు పరిమితం చేయొద్దు
  • ప్రభుత్వం దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వాలి

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచనను తాము సమర్ధిస్తున్నామని, తమ మేనిఫెస్టోలో ఈ అంశం కూడా ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది అక్కడి ప్రజల చిరకాల వాంఛ అని చెప్పారు. ఏపీకి మూడు రాజధానుల్లో భాగంగా ‘లెజిస్లేటివ్ క్యాపిటల్’, ’ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’ ఉండొచ్చని జగన్ అన్నారని, ‘లెజిస్లేటివ్ క్యాపిటల్’, ’ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’ అంటే ఏముంటాయని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలన్నది అందరి ఆలోచన అని, సమగ్ర రాష్ట్ర అభివృద్ధి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని అన్నారు. అలాంటి ఆలోచన నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేయలేదు కనుకనే హైదరాబాద్ లోనే కేంద్రీకృత అభివృద్ధి జరిగిందని, అందుకే, రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయామని చెప్పారు. అమరావతి ప్రాంత అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని, దాన్ని కేవలం, అసెంబ్లీ, కౌన్సిల్ కు పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని జీవీఎల్ కోరారు.

More Telugu News