We support Andhra Pradesh capital Amaravati: రాజధానిగా అమరావతే కొనసాగాలి: సీపీఐ రామకృష్ణ

  • రాష్ట్ర విభజన నేపథ్యంలో అదే చెప్పాం, ఇప్పుడూ అదే చెపుతున్నాం
  • అమరావతి రాజధానిగా ప్రతిపక్ష నేతగా జగన్ అంగీకరించారని వ్యాఖ్య
  • అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

పరిపాలన వికేంద్రీకరణకంటే అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. వెనుకబడ్డ ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా కొనసాగాలని డిమాండ్ చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన సమయంలోనే విజయవాడ రాజధానిగా ఉండాలని వామ పక్ష పార్టీలు స్పష్టం చేశాయన్నారు. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడలో పార్టీ కార్యాలయం ప్రారంభ సమయంలో కూడా మేమూ అదే చెప్పామన్నారు. ఇప్పటికీ అమరావతి రాజధానిగా ఉండాలన్న మాటకు కట్టుబడ్డామని రామకృష్ణ చెప్పారు.

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు శాసన సభలో రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించగా, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆమోదించారని సీపీఐ నేత గుర్తు చేశారు.   ప్రస్తుతం ఏ ప్రాంతంలో.. ఏంచేయాలన్న.. దానిపై జగన్ ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వంలోని మంత్రులందరూ కలిసి చర్చించిన తర్వాత ఏకాభిప్రాయంతో వివరాలను వెల్లడించాలన్నారు. అన్నిపక్షాలతో సమావేశం జరిపి అందరి అభిప్రాయాలను తీసుకుని అన్ని ప్రాంతాల మధ్య సామరస్య వాతావరణం కొనసాగిస్తూ.. వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధిపై చర్యలు చేపట్టాలన్నారు. తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికోసం ప్రయత్నం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

More Telugu News