శ్రీలంక నుంచి ఆసియా సూపర్ కార్ !

17-12-2019 Tue 18:44
  • ‘వేగ’ పేర 2020లో మార్కెట్లోకి..
  • జెనీవాలో జరుగనున్న అంతర్జాతీయ మోటార్ షోలో విడుదల
  • 3.1 సెకన్లలోనే సున్న నుంచి వంద కిలోమీటర్ల వేగానికి రీచ్
ఆసియాలో తొలిసారిగా ఒక సూపర్ కారును తయారు చేసిన ఘనతను శ్రీలంక సొంతం చేసుకుంది.  సూపర్ కారంటే నిజంగా సూపర్ కారే అని చెప్పవచ్చు అత్యంత వేగంగా నడిచే సూపర్ ఎలక్ట్రిక్ కారిది.  దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ కారు బ్యాటరీతో నడుస్తుంది. 300 కిలోవాల్టుల బ్యాటరీని ఒకసారి ఛార్జీచేస్తే.. 240 కిలోమీటర్లువరకు ఏకధాటిగా ప్రయాణం చేయవచ్చు. దీని ఆకారం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. స్పోర్టీ లుక్ ను కలిగివుంటుంది.

‘వేగ’ అని పేరుపెట్టిన కారు సున్న నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.1 సెకన్లలోనే అందుకుంటుంది. ఈ మేరకు వివరాలను ఈ కారు తయారీ సంస్థ కోడ్ జెన్ సీఈవో హర్ష సుబాసింఘే మీడియాకు వివరించారు. పూర్తిగా  శ్రీలంకలోనే తయారైన ఈ కారు 2020 ఏప్రిల్లో మార్కెట్లోకి రానుందన్నారు. ఈ కారులో అమర్చిన ఇంజిన్ 900బీహెచ్ పీ శక్తిని విడుదల చేస్తుందని చెప్పారు. జెనీవాలో జరుగనున్న అంతర్జాతీయ మోటార్ షోలో దీనిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.