Chandrababu: అమరావతిపై మీకెందుకంత కోపం?: జగన్ సర్కారును సూటిగా ప్రశ్నించిన చంద్రబాబు

  • చంద్రబాబు మీడియా సమావేశం
  • కూల్చివేతలకు బదులు పాలనపై దృష్టిపెడితే బాగుండేదని వెల్లడి
  •  అమరావతి అంశంపై వ్యాఖ్యలు

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలపై చూపించిన శ్రద్ధ పాలనపై చూపిస్తే బాగుండేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారపక్షం వైసీపీపై ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చి ఏం సాధించినట్టు అని ప్రశ్నించారు. అక్కడి శిథిలాలు ఇంకా తొలగించలేదని, ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఏం చేయగలిగారని నిలదీశారు. అమరావతి అంశంపైనా ఆయన సర్కారుపై విమర్శలు చేశారు. అమరావతిపై మీకెందుకంత కోపం? అని ప్రశ్నించారు. ఎందుకు పదేపదే ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారని మండిపడ్డారు.

"అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. మీరు రూపాయి ఖర్చుపెట్టనవసరంలేదు. భూసమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్ లో రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆ భూములను తీసుకుని డెవలప్ చేసి మళ్లీ వారికే కేటాయించాం. అలాంటప్పుడు భూములు కొనుగోలు చేయడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఎవరు ఏ భూమి కొన్నా టీడీపీ నేతల పేర్లు ప్రచారం చేస్తూ బినామీల పేర్లు చెప్పడం దారుణమైన విషయం. ఇది నీచమైన పని. హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన భూములు రాజధాని ప్రాంత పరిధిలోకి రావు. వాళ్లు ఏదో చిల్లింగ్ సెంటర్ స్థాపన కోసం భూమి తీసుకున్నారు. ఆ విషయంలోనూ మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు.

అమరావతిలో అవినీతి జరిగిందని భావిస్తే ఆర్నెల్లపాటు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎవరు ఆపారు మిమ్మల్ని? అమరావతి ప్రాజెక్టును ఆపేయాలన్నదే మీ ఆలోచన. ప్రాజెక్టును చంపేయాలని అనేక అభియోగాలు చేశారు. సింగపూర్ నుంచి అమరావతి వచ్చింది అక్కడి ప్రభుత్వ కంపెనీలే. సింగపూర్ ప్రభుత్వమే ముందుకొచ్చింది. ఆ విధంగా మాస్టర్ ప్లాన్ వివరాలు సిద్ధం చేశారు. ఇలాంటి ఆలోచనలతో 20 ఏళ్ల కిందట అభివృద్ధి మొదలుపెట్టిన హైదరాబాద్ ఇవాళ మెగా సిటీ అయింది. ఈ విధంగా ఆలోచించి ఉంటే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చేది కాదు" అని వ్యాఖ్యానించారు.

More Telugu News