Jamia Milia: జామియా మిలియా వర్శిటీలో పోలీసులు కాల్పులు జరిపారన్నది అవాస్తవం: ఢిల్లీ పోలీసుల వివరణ

  • కాల్పులు జరిపినట్టు వస్తున్న వీడియోలను నమ్మొద్దు
  • అతి తక్కువ మంది బలగాలనే వినియోగించాం
  • వారి వద్ద ఆయుధాలు కూడా లేవు: ఎమ్ ఎస్ రంధావా

జాతీయ పౌరసత్వ సవరణ చట్టంపై  ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్థుల నిరసన ప్రదర్శనలు హింసాత్మక ఘటనలకు దారి తీసిన విషయం తెలిసిందే. పోలీసులు యూనివర్శిటీలోకి వెళ్లి అమానవీయంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ ప్రజా సంబంధాల అధికారి ఎమ్ ఎస్ రంధావా వివరణ ఇచ్చారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, యూనివర్శిటీలో జరిగిన ఆందోళనల్లో ఎవరూ చనిపోలేదని స్పష్టం చేశారు. పోలీసులు కాల్పులు జరిపినట్టు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవమని చెప్పారు. అసలు, యూనివర్శిటీలో కాల్పులు జరపలేదని, అతి తక్కువ మంది బలగాలనే వినియోగించామని, వాళ్ల దగ్గర ఆయుధాలు కూడా లేవని, వారి సాయంతోనే హింసాత్మక ఆందోళనలను నియంత్రించామని చెప్పారు. ఈ అంశంపై విశ్వవిద్యాలయ యాజమాన్యంతో, విద్యార్థి సంఘాలతో మాట్లాడుతున్నామని అన్నారు.

నిన్న రాత్రి రోడ్డుకు ఇరువైపుల నుంచి  పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారని, ఈ క్రమంలో బాష్పవాయుగోళాలు ప్రయోగించాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో సంఘ విద్రోహశక్తులు, రౌడీలు యూనివర్శిటీలోకి పారిపోయారని, వాళ్లను పట్టుకునేందుకే పోలీసులు కూడా వాళ్ల వెనుకే వర్శిటీలోకి ప్రవేశించాల్సి వచ్చిందని వివరించారు. ఈ విషయమై తాము పూర్తి స్థాయి విచారణ  జరుపుతున్నట్టు చెప్పారు. స్థానికులు కొందరు యూనివర్శిటీ లోపల ఉన్నారని, వారిని గుర్తించి చర్యలు చేపడతామని రంధావా తెలిపారు. 

More Telugu News