Janasena: పార్టీలో కాదు పవన్ కల్యాణ్ లోనే మార్పు వచ్చింది: రాజు రవితేజ

  • పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా నడుస్తున్నారు 
  • అందుకే ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశా
  • పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు

జనసేన పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజు రవితేజ్ మరోమారు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా నడుస్తున్నారు కనుకనే ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశానని మరోమారు స్పష్టం చేశారు. పార్టీలో మార్పు కాదు పవన్ కల్యాణ్ లో మార్పు వచ్చిందని, ఈ పార్టీతో తనకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని చెప్పిన రాజు రవితేజ, కుల రాజకీయం చేయకూడదని పార్టీ సిద్ధాంతంగా ఉన్నప్పుడు దానిని పక్కనబెడితే ఎలా? అని ప్రశ్నించారు.

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని.. ఇందుకు ఉదాహరణలు చెప్పాలంటే కోకొల్లలు వున్నాయని అన్నారు. పాప్యులర్ అయ్యేందుకనే పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని గతంలో పలుమార్లు వ్యాఖ్యలు చేశారు కదా, మరి, ఇప్పుడు మీకు కూడా ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అలా అనుకునే అవకాశం ఉందని, అయితే, తాను ఎందుకు విమర్శలు చేస్తున్నానో పవన్ కల్యాణ్ కు తెలుసని అన్నారు. జనసేన పార్టీ అధినేత  పవన్ కల్యాణ్ , నేతలు, నాయకులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి వుండాలని సూచించారు.

More Telugu News