లగేజ్ పోయిందని '100'కు కాల్ చేస్తే... నిమిషాల్లోనే..!

15-12-2019 Sun 08:57
  • సౌదీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆరిఫ్
  • క్యాబ్ బుక్ చేసుకుని లగేజీని మరచిన వైనం
  • యాప్ సాయంతో డ్రైవర్ ను గుర్తించిన పోలీసులు

సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్ చేరుకున్న వ్యక్తి, విజయవాడకు వెళ్లాలన్న ఉద్దేశంతో క్యాబ్ బుక్ చేసుకుని, అందులో తన లగేజీ బ్యాగ్ ను మరచిపోగా, విషయం తెలుసుకున్న పోలీసులు, సాంకేతికత సాయంతో నిమిషాల్లోనే లగేజీని తిరిగి తెప్పించారు. వివరాల్లోకి వెళితే, ఆరిఫ్ అనే వ్యక్తి, విజయవాడ వెళ్లేందుకు ఎల్బీ నగర్ వరకూ క్యాబ్ బుక్ చేసుకున్నాడు.

క్యాబ్ దిగిన తరువాత చూసుకోగా, ఓ బ్యాగ్ కనిపించలేదు. దాన్ని దించుకునే లోపే డ్రైవర్ తన వాహనంతో వెళ్లిపోయాడని తెలుసుకున్న ఆరిఫ్, వెంటనే '100'కు కాల్ చేసి విషయం చెప్పాడు. నిమిషాల్లో స్పందించి, అక్కడికి చేరుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను చూసి, క్యాబ్ నంబర్ ను గుర్తించారు. ఆ వెంటనే అతని ఫోన్ నంబర్ ను సేకరించి, ఫోన్ చేసి, రప్పించారు. పోలీసింగ్ యాప్ కారణంగానే డ్రైవర్ ఫోన్ నంబర్ వెంటనే తెలిసిందని పోలీసులు వెల్లడించగా, వారికి ఆరిఫ్ కృతజ్ఞతలు చెప్పి, తన గమ్యానికి బయలుదేరాడు.