Rahul Sinha: పశ్చిమ బెంగాల్ లో అశాంతి... రాష్ట్రపతి పాలన యోచనలో బీజేపీ!

  • అశాంతికి కారణం మమతా బెనర్జీ విధానాలే
  • నిరసనకారులపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని మండిపాటు
  • కోల్ కతాలో మీడియాతో మాట్లాడిన రాహుల్ సిన్హా

పౌరసత్వ బిల్లు అమలులోకి వచ్చిన తరువాత, పశ్చిమ బెంగాల్ లో హింస ప్రజ్వరిల్లుతుండటంతో రాష్ట్రపతి పాలన విధించాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశీ ముస్లింలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిష్ట వేసుకుని ఉన్నారని ఆరోపిస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా, హింస ఇలాగే కొనసాగితే, రాష్ట్రపతి పాలన విధించాలని కోరతామని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు. గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో అశాంతి నెలకొందని విమర్శలు గుప్పించిన ఆయన, రాష్ట్రపతి పాలన మినహా మరో దారి కనిపించడం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.

కోల్ కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన, టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రం రావణ కాష్టంలా కాలుతుంటే, మిన్నకుందని నిప్పులు చెరిగారు. నిరసనకారులు, సంఘ విద్రోహులపై మమత ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ హింసాకాండ వెనుక బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు ఉన్నారన్న విషయం తెలిసి కూడా, వారి కారణంగానే అశాంతి నెలకొందని అన్నారు. రాష్ట్రంలోని ముస్లింలు తమ పేర్లు నిరసనకారుల జాబితాలో లేకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, కఠిన చర్యలు తీసుకునేందుకు ఆసక్తిగా లేని మమతా బెనర్జీ, రొటీన్ స్టేట్ మెంట్లతో సరిపెడుతున్నారని సిన్హా మండిపడ్డారు.

More Telugu News