ఆరేళ్ల మోదీ పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

14-12-2019 Sat 21:01
  • మీరు చేసిందొక్కటే.. ప్రజలను తప్పుదోవ పట్టించడమంటూ మండిపాటు
  • రైతులకు, యువతకిచ్చిన హామీల అమలులో విఫలమయ్యారు
  • కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపు

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులు, యువతకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ధ్వజమెత్తారు. గత ఆరేళ్ల మోదీ పాలనలో ప్రజలను తప్పదోవ పట్టించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఈ రోజు డిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ‘భారత్ బచావో’ ర్యాలీలో మన్మోహన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘ఎన్నికల సమయంలో యువతకు ఉపాధి, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ద్వారా జీడీపీని పెంచుతామని మోదీ హామీ ఇచ్చారు. కానీ అవేవీ నెరవేర్చలేదు. 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఏడాదికి 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఆ హామీలన్నీ వట్టివేనని రుజువైంది. ఈ ఆరేళ్ల కాలంలో మోదీ చేసిన పని ప్రజలను తప్పదోవ పట్టించడమొక్కటే’ అని విమర్శించారు.

ప్రజలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొనడానికి దేశం నలుమూలలనుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.