India: కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ అవసరాన్ని విదేశాలు ఎలా ఉపయోగించుకున్నాయో చెప్పిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్

  • చండీగఢ్ లో మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్
  • హాజరైన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మాలిక్
  • స్వావలంబన లేకపోవడమే భారత్ దుస్థితికి కారణమని విశ్లేషణ

చండీగఢ్ లో నిర్వహిస్తున్న మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్ లో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీపీ మాలిక్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడిందని, భారత్ అవసరాన్ని ఆసరాగా చేసుకుని విదేశాలు భారీగా దోచుకున్నాయని వీపీ మాలిక్ ఆరోపించారు. వాస్తవ ధరల కంటే ఎక్కువ మొత్తానికి భారత్ కు ఆయుధాలు, మందుగుండు సరఫరా చేశాయని తెలిపారు. ఆఖరికి ఒక్కో శాటిలైట్ చిత్రానికి కూడా రూ.36 వేల వరకు చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉపగ్రహ చిత్రాలు కూడా మూడేళ్ల కిందటివని అన్నారు.

ఓ దేశాన్ని తుపాకుల కోసం సంప్రదిస్తే, పాత తుపాకీలు అంటగట్టిందని, మందుగుండు కోసం మరో దేశాన్ని సంప్రదిస్తే 70వ దశకం నాటి మందుగుండు అందించిందని వెల్లడించారు. స్వావలంబన లేకపోవడమే ఆనాడు భారత్ దుస్థితికి కారణమని విశ్లేషించారు. ఇప్పటికైనా ఆయుధాలను దేశీయంగా అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. వీపీ మాలిక్ నాడు కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యానికి నేతృత్వం వహించారు.

More Telugu News