CAB ACT: పౌరసత్వ సవరణ చట్టంపై పలుచోట్ల మిన్నంటిన నిరసనలు

  • ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థుల భారీ ర్యాలీ
  • అడ్డుకున్న పోలీసులు, లాఠీచార్జీ.. పలువురికి గాయాలు
  • అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్షలు బహిష్కరించిన విద్యార్థులు

పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు తారస్థాయికి చేరాయి. ఢిల్లీలో విద్యార్థులు చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో విద్యార్థులు పరీక్షలు బహిష్కరించగా, పశ్చిమబెంగాల్లో ఆందోళనకారులు రైల్వేస్టేషన్ కు నిప్పు పెట్టారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ సహా అరుణాచల్ ప్రదేశ్ లో నిరసనలు తీవ్రమయ్యాయి.

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్లమెంట్ వద్దకు రెండువేల మంది విద్యార్థులు ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.  విద్యార్థులు యూనివర్సిటీ నుంచి బయటకు రాకుండా గేట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినా విద్యార్థులు వాటిని దాటి ముందుకు సాగారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి మరింత దిగజారింది. పోలీసులు లాఠీచార్జీ జరిపి 50మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.  తాము శాంతియుతంగా ర్యాలీ చేపడుతున్నామని చెపుతున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని విద్యార్థులు మీడియాకు తెలిపారు.

మరోవైపు పశ్చిమబెంగాల్లో  వేలాదిమంది ఆందోళనకారులు బంగ్లాదేశ్ సరిహద్దులోని ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగా రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని నిప్పు పెట్టారు. అక్కడి సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కూడా దాడి చేశారు. అటు అరుణాచల్ ప్రదేశ్ లో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. వెంటనే పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థులు రాజ్ భవన్ వద్దకు ర్యాలీగా వెళ్లి ఈ చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ ఆందోళనలో అస్సామీ విద్యార్థులు కూడా పాలుపంచుకున్నారు.

More Telugu News