ఆ పదాన్ని పదేపదే పలుకుతూ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పై కోపాన్నంతా తీర్చుకున్నారు: అచ్చెన్నాయుడు

  • మేము 'ఉన్మాది' అన్నామో, లేదో తెలియదు
  • ఈ పదాన్ని పదేపదే పలుకుతూ వైసీపీ సభ్యులు జగన్ పై కోపం తీర్చుకున్నారు
  • అవంతి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు
ఏపీ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ జరిగింది. మంత్రి కన్నబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు సరదాగా మాట్లాడుకున్నారు. వైసీపీ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్ పై ఎంత కోపం ఉందో సభలో బయట పడిందని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ ను ఉద్దేశించి తాము 'ఉన్మాది' అన్నామో, లేదో తెలియదు కానీ... వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం పదేపదే 'ఉన్మాది' అనే పదాన్ని ఉచ్చరిస్తూ జగన్ పై ఉన్న కోపాన్నంతా తీర్చుకున్నారని చెప్పారు.

ఇదే సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ అంశం చర్చకు వచ్చింది. టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్లీ వెనక్కి వచ్చేస్తానని చెప్పే ఆయన వైసీపీలో చేరారని... ఇప్పుడు మాత్రం సభలో నీతులు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై కన్నబాబు స్పందిస్తూ, టీడీపీలోకి ఎప్పుడు, ఎవరు వచ్చినా తలుపులు తెరిచే ఉంటాయన్న విషయం అవంతికి అర్థమైనట్టుందని నవ్వుతూ చెప్పారు.

పేరు చివర నాయుడు ఉన్నవారికే టీడీపీలో ప్రాధాన్యత ఉంటుందని దానికి అచ్చెన్నాయుడు, రామానాయుడే ఉదాహరణ అని కన్నబాబు చమత్కరించారు. దీనికి కూడా రకరకాల అర్థాలు తీస్తే ఎలాగని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వెనకబడిన ప్రాంతాల వారికి వెనకబడిన పేర్లే ఉంటాయని అన్నారు.
Go Back to Shorts
Jagan
Achennaidu
Telugudesam
YSRCP

More Telugu News