Tollywood: ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు ఇకలేరు

  • అనారోగ్యంతో బాధపడిన గొల్లపూడి
  • చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు (80) ఇకలేరు. అనారోగ్యంతో బాధపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. అంతకు ముందు నాటకాలు, నవలలు, కథలు కూడా రచించారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలోనూ పనిచేశారు.

సినీరంగంలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగు సినీ రంగంలో మాటల రచయితగానూ పేరు తెచ్చుకున్నారు. సినీరంగంలో మొదటి రచన 'డాక్టర్ చక్రవర్తి'కి ఉత్తమ రచయితగా ఆయన నంది పురస్కారం అందుకున్నారు.

గొల్లపూడి రచనలు కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. తెలుగు నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాల సంపుటి ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా ఉంది.

మారుతీరావు 1939, ఏప్రిల్‌ 14న విజయనగరంలో జన్మించారు. ఆయన భార్య పేరు శివకామసుందరి. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా, ఓ కుమారుడు శ్రీనివాస్ అకాలమరణం చెందారు. గొల్లపూడి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

More Telugu News