Disha: విచారణకు మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు?: ఎన్ కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

  • ఎన్ కౌంటర్ పై కొనసాగుతోన్న వాదనలు
  • పరిష్కారం తీసుకొచ్చే దర్యాప్తు కావాలన్న సుప్రీంకోర్టు
  • సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న ముకుల్ రోహత్గి

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన 'దిశ' నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఎన్ కౌంటర్ పై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అనుకుంటున్నామని సీజే జస్టిస్ బోబ్డే అన్నారు. పరిష్కారం తీసుకొచ్చే దర్యాప్తు కావాలని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, సిట్ ఏర్పాటు చేసి ఇప్పటికే ఎన్ కౌంటర్ పై దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు.  

ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను మీరు క్రిమినల్ కోర్టు ద్వారా విచారించాలనుకుంటే కనుక ఈ విషయంలో తాము చేసేది ఏమీ ఉండదని బోబ్డే తెలిపారు. ఈ విషయంలో పోలీసుల పక్షాన తప్పులేదని ప్రభుత్వం చెబుతుంటే కనుక, అసలు వాస్తవం ఏమిటన్నది ప్రజలకు తప్పకుండా తెలియాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కచ్చితంగా విచారణ జరగాలని అంటూ, విచారణకు ఎందుకు ఒప్పుకోవట్లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని బోబ్డే ప్రశ్నించారు.

More Telugu News