Chandrababu: చంద్రబాబును కూడా లాగేశారు.. మార్షల్స్ కు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?: అచ్చెన్నాయుడు

  • చిన్న కాగితం ఉందని 40 నిమిషాలు బయటే నిలబెట్టారు
  • ఇలాగైతే సభలో ఉండలేమన్న అచ్చెన్నాయుడు
  • సభలో ఉండాలా? వద్దా? అనే విషయాన్ని ప్రతిపక్షానికే వదిలేస్తున్నానన్న స్పీకర్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పటిలాగే వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, అసెంబ్లీ వెలుపల మార్షల్స్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా మార్షల్స్ లాగేశారని... వారికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.

చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై మార్షల్స్ చేయి వేశారని మండిపడ్డారు. గేటు దగ్గర తమను అడ్డుకున్నారని... నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులు, బ్యానర్స్ వద్దని చెబితే తాము తీసేశామని... అయినా పేపర్లు కూడా లోపలకు తీసుకువెళ్లరాదని చెబుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేతిలో చిన్న తెల్ల కాగితం ఉందనే కారణంతో 40 నిమిషాల సేపు బయటే నిలబెట్టారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్ వ్యవహారశైలి సరిగా లేదని అన్నారు.

దీనికి సమాధానంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ... అసెంబ్లీలోకి ప్లకార్డులు, బ్యానర్లను తీసుకురాకూడదనే నిబంధనను టీడీపీ హయాంలోనే తీసుకొచ్చారని చెప్పారు. మార్షల్స్ ను టీడీపీ సభ్యులే తోసేశారని... టీడీపీ సభ్యులపైనే మార్షల్స్ ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.

దీనిపై అచ్చిన్నాయుడు స్పందిస్తూ... ఈ నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పారు. గతంలో అసెంబ్లీలోకి వైసీపీ సభ్యులు ప్లకార్డులు తీసుకురాలేదా? బెంచీలు ఎక్కి అరవలేదా? అని ప్రశ్నించారు. ఈ విధంగా చేయలేదని చెబితే పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని అన్నారు. మార్షల్స్ ను పిలిపించి స్పీకర్ మాట్లాడాలని... లేకపోతే సభలో తాము ఉండలేమని చెప్పారు. దీనిపై స్పీకర్ తమ్మినేని స్పందస్తూ, సభలో ఉండాలా? వద్దా? అనే విషయాన్ని ప్రతిపక్షానికే వదిలేస్తున్నానని అన్నారు.

More Telugu News