Chandrababu: మా ఇంటిని ముంచడంపై ఉన్న శ్రద్ధ రాయలసీమపై పెడితే బాగుండేది: చంద్రబాబు

  • తన ఇంటిని ముంచాలనుకున్నారంటూ చంద్రబాబు ఆరోపణలు
  • లంక గ్రామాలను ముంచారంటూ మండిపాటు
  • అసెంబ్లీలో అడిగితే రాద్ధాంతం చేస్తున్నారన్న చంద్రబాబు

ఈ సంవత్సరం ఎక్కడా లేని విధంగా భారీ వర్షాలు పడ్డాయని, 797 టీఎంసీల నీళ్లు కృష్ణా నది నుంచి సముద్రంలోకి వెళ్లాయని, గోదావరి నుంచి 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లాయని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు. బెజవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వర్షాల కారణంగా వరదలు వస్తే ఒక వారం రోజులపాటు శ్రీశైలం వద్దే ఆ నీటిని ఆపేసి, ఆ తర్వాతే దిగువకు వదిలారని, తన ఇంటిని ముంచాలన్న దురుద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. తన ఇల్లు ముంపు ప్రాంతంలో ఉందని నిరూపించడానికి కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు.

వారం రోజుల పాటు ఆపేసిన నీటిని ఒక్కసారిగా విడుదల చేయడంతో లంక గ్రామాలన్నీ నీట మునిగాయని, కానీ తన నివాసాన్ని ముంచాలని చూపించిన శ్రద్ధ రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని అందించడంపై చూపించి ఉంటే బాగుండేదని అన్నారు. ఆ నీటిని రాయలసీమకు తీసుకెళ్లాలని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదని విమర్శించారు.

ఇదే విషయాన్ని ఇవాళ సభలో అడిగితే రాద్ధాంతం చేస్తున్నారని, ముఖ్యమంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల పనులన్నీ తానే చేసినట్టు సీఎం వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, ఒక్క మట్టి తట్ట తీశారా? ఒక యూనిట్ కాంక్రీట్ పని జరిగిందా? అని ప్రశ్నించారు. మీకేం అర్హత ఉందని మాట్లాడుతున్నారు అంటూ నిలదీశారు.

More Telugu News