Nara Lokesh: తెలుగులో ఒక్క పదం తప్పుగా పలికితే... ఇంత రాద్ధాంతమా?: నారా లోకేశ్ నిప్పులు

  • ఎనిమిది సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను
  • ప్రస్తుతం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా
  • చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం లేదు
  • మంగళగిరిలో తెలుగుదేశం నిరసనలో లోకేశ్

తాను ఎనిమిది సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చిన వాడినని, తెలుగులో ఒక పదం తప్పుగా పలికినంత మాత్రాన, దాన్ని అదేపనిగా ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం మంగళగిరి బస్టాండు వద్ద తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఆయన నిరసనకు దిగారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ ప్రసంగిస్తూ, తన తల్లిదండ్రులు తనను ఓ క్రమశిక్షణతో పెంచారని అన్నారు. ఇంట్లోనే తెలుగు తప్పుగా మాట్లాడి దండనకు గురైన రోజులు ఉన్నాయని అన్నారు.

తాను ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నానని వ్యాఖ్యానించిన ఆయన, తాను ఏ తప్పూ చేయకపోయినా ఆరోపణలు మాత్రం చేస్తున్నారని, చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 2012 నుంచి తనపై అన్ని రకాలుగా దుష్ప్రచారం జరుగుతూనే ఉందని మండిపడ్డారు. అసెంబ్లీలో తాను ఉన్నా, లేకున్నా, ఆరోపణలు ఆగడం లేదని లోకేశ్ అన్నారు. తెలుగు తప్పుగా మాట్లాడుతున్నానని అంటున్నారని, శాసనసభలో లేని లోకేశ్ ను చూసి వైసీపీ నేతలకు ఎందుకంత భయమని ప్రశ్నించారు.

తాను తెలుగులో తప్పుగా మాట్లాడటం వల్ల పెట్టుబడులు వెనక్కి పోలేదని, పోలవరం ప్రాజెక్టు ఆగలేదని, తాను జగన్ మాదిరిగా చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకాన్ని కాదని వ్యాఖ్యానించారు. తన తండ్రి విజయం సాధించిన చోటనే గెలవాలని తానేమీ భావించలేదని, ఎప్పుడూ గెలవని మంగళగిరిలో విజయం సాధించాలని అనుకున్నానని, ఓడిపోయినా, తాను ఆ ప్రాంత ప్రజలకు దూరం కాలేదని అన్నారు.

హెరిటేజ్ ఫ్రెష్ సంస్థను అమ్మేశామని చెబుతున్నా, తమకు షేర్లు ఉన్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని లోకేశ్ విమర్శించారు. ఆర్థిక మంత్రి బుగ్గన, తన అఫిడవిట్ లో పలు సంస్థల్లో షేర్లు ఉన్నాయని చూపించారని, వాటిల్లో ఉత్పత్తుల ధరలు పెరిగితే బాధ్యత బుగ్గన వహిస్తారా? అని ప్రశ్నించారు. దినపత్రికలను రూ.2కే విక్రయించాలని ఉద్యమం చేసిన సాక్షి పత్రిక, ఇప్పుడు రూ. 7కు ఎందుకు అమ్ముతోందని లోకేశ్ నిప్పులు చెరిగారు.

జగన్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచిందని, ఇకపై అన్నీ పెంచుకుంటూ వెళుతుందనడంలో సందేహం లేదని, ఇప్పటికైనా వ్యక్తిగత ఆరోపణలు మాని, ప్రజా సమస్యలపై దృష్టిని సారించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ సందర్భంగా గతంలో పలు సమయాల్లో వైఎస్ జగన్, తెలుగులో తప్పుగా మాట్లాడిన వీడియోలను లోకేశ్ ప్రదర్శించారు.

More Telugu News