Unnao rape case: ఉన్నావో అత్యాచార కేసులో 16న తుది తీర్పు.. బీజేపీ ఎమ్మెల్యే భవితవ్యం ఏమిటో?

  • ఉన్నావో అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే
  • 2017లో బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం
  • సుప్రీం జోక్యంతో యూపీ నుంచి ఢిల్లీ కోర్టుకు మారిన కేసు

ఉన్నావో అత్యాచారం కేసులో ఈ నెల 16న తుది తీర్పు రానుంది. ఈ మేరకు ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ తెలిపారు. 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఓ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సుప్రీం ఆదేశాలతో కేసు యూపీ నుంచి ఢిల్లీ, తీస్ హజారి సెషన్స్ కోర్టుకు మారింది. కేసు విచారణ గోప్యంగా జరగ్గా, తీర్పును కోర్టు 16కు వాయిదా వేసింది.

కాగా, జులై 28న బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాధితురాలు, ఆమె తరపు లాయర్ తీవ్రంగా గాయపడగా బాధితురాలి అత్త, మరో బంధువు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొంది కోలుకుంది. ప్రస్తుతం ఆమె కుటుంబానికి ఢిల్లీ మహిళా కమిషన్‌ ఆశ్రయమిచ్చింది. ఢిల్లీలోనే ఉన్న ఆమె కుటుంబానికి సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో రక్షణ కల్పించారు. కాగా, ఈ నెల 16న కోర్టు తీర్పుతో బీజేపీ ఎమ్మెల్యే భవితవ్యం ఏమిటో తేలిపోనుంది.

More Telugu News