భర్తతో అక్రమ సంబంధం అనుమానం.. సూర్యాపేటలో నర్సులపై మహిళా వైద్యురాలి దాష్టీకం!

10-12-2019 Tue 13:24
  • నర్సులకు 6 గంటల పాటు నరకం చూపిన వైద్యురాలు
  • ఫినాయిల్, యాసిడ్ బాటిల్, సూదులు, కత్తులతో బెదిరింపులు
  • ఎట్టకేలకు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత నర్సులు

తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానించిన ఓ వైద్యురాలు మహిళా నర్సులను బంధించడమే కాకుండా, వారిలో ఒకరిని సూదులతో గుచ్చుతూ.. ఆపరేషన్ కు వాడే కత్తులతో బెదిరించిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. సూర్యాపేట పట్టణంలో డాక్టర్ విజయలక్ష్మి, ఆమె భర్త డాక్టర్ రామకృష్ణలు 'విజయకృష్ణ' పేరుతో స్థానికంగా ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నడుపుతున్నారు.

విజయలక్ష్మికి కొంతకాలంగా ఆసుపత్రిలో పనిచేసే నర్సులకు తన భర్తతో అక్రమ సంబంధం ఉందనే అనుమానం కలిగింది. దీంతో గొడవలు జరగడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే సదరు నర్సులను విధుల నుంచి తొలగించారు. అయినా అనుమానం తీరని వైద్యురాలు ఈనెల 6వ తేదీన నర్సులు సునీత, ప్రమీలను ఆసుపత్రికి పిలిపించి రెండు కుర్చీలలో బంధించింది. అనంతరం వారిచేత ఫినాయిల్ తాగిస్తానని, యాసిడ్ పోస్తానని ఫినాయిల్, యాసిడ్ బాటిళ్లతో భయబ్రాంతులకు గురి చేసింది. తన భర్తతో అక్రమ సంబంధం ఉంటే మానుకోవాలని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

సునీత అనే నర్సును సూదులతో గుచ్చుతూ, ఆపరేషన్ కు వాడే కత్తులతో చంపుతానని బెదిరించింది. ఆరు గంటల పాటు సాగిన ఈ దాష్టీకాన్ని ప్రమీలతో పాటు అక్కడే ఉన్న మరో నర్సు ఆండాళ్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఈ సంఘటన జరిగిన రోజున డాక్టర్ రామకృష్ణ ఊరులో లేరని సమాచారం. ఎట్టకేలకు మిగిలిన నర్సుల సాయంతో తప్పించుకున్న సునీత సూర్యాపేట పోలీస్ స్టేషన్లో డాక్టర్  విజయలక్ష్మిపై ఫిర్యాదు చేసింది.