Dera chief: జైలులో డేరాబాబాతో హనీప్రీత్ రహస్య మంతనాలు.. గంటన్నరపాటు ఏం మాట్లాడుకున్నారు?

  • ఇటీవల బెయిలుపై బయటకు వచ్చిన హనీప్రీత్
  • న్యాయపోరాటం ద్వారా బాబాను కలిసిన హనీప్రీత్
  • అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్

న్యాయపోరాటం ద్వారా జైలు శిక్ష అనుభవిస్తున్న డేరాబాబాను జైలులో కలిసిన హనీప్రీత్ దాదాపు గంటన్నరపాటు రహస్యంగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. డేరాబాబా అరెస్ట్ తర్వాత అల్లర్లకు పురికొల్పి హింసాకాండకు కారణమైనట్టు ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన హనీప్రీత్‌కు ఇటీవల పంచకుల కోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో అంబాలా జైలు నుంచి విడుదలైన హనీప్రీత్ తాజాగా రోహ్‌తక్ జైలులో ఉన్న డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్‌ను కలిసింది.

నిజానికి డేరాబాబాను కలిసేందుకు హనీప్రీత్‌కు పోలీసులు తొలుత అనుమతి ఇవ్వలేదు. దీంతో హనీప్రీత్  హర్యానా జైళ్ల శాఖ డైరెక్టరు జనరల్‌కు లేఖ రాసింది. డేరాబాబాను కలవకుండా హనీప్రీత్‌ను నిలువరించడం ఆమె ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుందని సుప్రీం న్యాయవాది ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఆమెను అనుమతించకుంటే  జైళ్లశాఖ డీజీపీతోపాటు కోర్టును కూడా ఆశ్రయిస్తామని ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఎట్టకేలకు న్యాయపోరాటం తర్వాత జైలులో డేరాబాబాను కలిసిన హనీప్రీత్ గంటన్నరపాటు ఆయనతో చర్చలు జరిపింది. వారు ఏం మాట్లాడుకున్నారన్న విషయాలు బయటకు రాలేదు. కాగా, అత్యాచారం కేసుల్లో డేరాబాబా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

More Telugu News