soyam baapurao: ఎస్టీ రిజర్వేషన్ నుంచి లంబాడాలను తొలగించాలి: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు

  • దేశ రాజధానిలో ఆదివాసీల గర్జన
  • 97 శాతం రిజర్వేషన్లు లంబాడాలే అనుభవిస్తున్నారని సోయం ఆరోపణ
  • తెలంగాణలో రిజర్వేషన్ కోసం లంబాడాలు వలస వస్తున్నారన్న ఎంపీ

రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన హక్కులను కాపాడటానికి కేంద్రం తగిన రీతిలో స్పందించాలని, ఎస్టీ రిజర్వేషన్ నుంచి లంబాడాలను తొలగించడం ద్వారా ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంస్థ ‘తుడుందెబ్బ’ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు కేంద్రాన్ని కోరారు.

సోమవారం దేశరాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన ‘ఆదివాసీ అస్తిత్వ పోరాట సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. లంబాడాలను ఎస్టీల జాబితా నుంచి తొలగించడం, ఏజెన్సీలో నకిలీ కుల ధృవపత్రాలను అరికట్టడం, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో ఈ సభ జరిగింది.

ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఎస్టీ రిజర్వేషన్ ను నిబంధనలకు విరుద్ధంగా 97 శాతం లంబాడాలే వాడుకుంటున్నారని, 1976 ఎమర్జెన్సీ కాలంలో నిబంధనలను తుంగలో తొక్కి లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారని అన్నారు. ఈ కారణంగా ఆదివాసీ యువత విద్య ఉపాధి రంగాల్లో తీవ్రంగా నష్టపోతోందని, ఆదివాసీల భవిష్యత్ కు ఇది భంగకరమైని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టికల్ 342 ప్రకారం సుగాలీలు, లంబాడా కులాలకు చట్టబద్ధత లేదని, అయినా తెలంగాణలో వారు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కారణంగానే వివిధ రాష్ట్రాల నుంచి లంబాడాలు తెలంగాణకు వలస వస్తున్నారని, ఒకప్పుడు 1 లక్షా 20 వేలు ఉన్న వారి జనాభా ఇప్పడు 20 లక్షలకు చేరడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దేశ అత్యున్నత వ్యవస్థ అయిన పార్లమెంటులో ఆదివాసీల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తానని ఈ సందర్భంగా సభనుద్దేశించి పేర్కొన్నారు.

More Telugu News