banjarahills: బంజారాహిల్స్ వ్యాపారి ఇంట్లో చోరీ: కోటి విలువైన వజ్రాల హారం మాయం

  • పరారీలో పనిమనిషి కరణ్
  • ఆదివారం రాత్రి వివాహ వేడుకకు వెళ్లిన వ్యాపారి కుటుంబం
  • రంగంలోకి డిటెక్టెవ్ ఇన్స్ పెక్టర్ రవికుమార్ బృందం

సంపన్నులకు పెట్టింది పేరైన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో ఏ సంఘటన జరిగినా సంచలనమే. పైగా దొంగతనం అయితే మరీ హాట్ టాపిక్ అవుతుంది. ఎన్నో సంచలన దొంగతనాలకు కేరాఫ్ అయిన ఈ ప్రాంతంలో సోమవారం మరో ఘరానా చోరీ వెలుగు చూసింది.

బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నివాసం ఉండే కపిల్ గుప్తా అనే వ్యాపారి ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఈ సందర్భంగా కోటి రూపాయల విలువైన వజ్రాల హారం అపహరణకు గురైంది. ఈ మేరకు కపిల్ గుప్తా సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుప్తా ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఓ వివాహానికి వెళ్లారు. సోమవారం ఇంటికి చేరిన ఆయనకు బెడ్ రూంలోని అల్మరా తెరిచి ఉండటం కనిపించింది. అందులో ఉండాల్సిన కోటి రూపాయల విలువైన వజ్రాల హారం కనిపించలేదు.

పనివారిపై అనుమానంతో విచారించగా బిహార్ కు చెందిన రామ్ నివాస్ అలియాస్ కరణ్ అనే వ్యక్తి కనిపించలేదు. అతని సెల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అని వస్తోంది. ఇతను 40 రోజుల క్రితమే ఇక్కడ పనికి కుదిరినట్లు తెలిసింది. దీంతో కరణ్ ఈ దొంగతనానికి పాల్పడి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిటెక్టెవ్ ఇన్ స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తును మొదలు పెట్టారు.

More Telugu News