Airtel: ఔట్ గోయింగ్ కాల్స్ పై పరిమితి తొలగించిన ఎయిర్ టెల్!

  • ఇటీవల టారిఫ్ లను పెంచిన టెలికమ్ సంస్థలు
  • పేరుకు అన్ లిమిటెడ్, పరిమితి దాటితే వడ్డింపు
  • గతంలో మాదిరి అపరిమితంగా మాట్లాడుకోవచ్చన్న ఎయిర్ టెల్

అన్ లిమిటెడ్ ప్లాన్లు తీసుకున్నా, ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ పై పరిమితులు ఉన్న ఈ రోజుల్లో, దాన్ని ఎత్తివేస్తూ, భారతీ ఎయిర్ టెల్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన అన్ని ప్లాన్లకూ ఇది వర్తిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను 43 నుంచి 50 శాతం వరకూ పెంచిన ఎయిర్ టెల్, ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ పై 12 వేల నిమిషాల ఇతర నెట్ వర్క్ ల ఔట్ గోయింగ్ కాల్స్ పరిమితిని విధించిన సంగతి తెలిసిందే. ఆపై చేసే కాల్స్ కు నిమిషానికి 6 పైసలు వసూలవుతాయని కూడా ప్రకటించింది.

దీనిపై విమర్శలు వెల్లువెత్తగా, దిగొచ్చిన సంస్థ ఎయిర్ టెల్ నుంచి, ఏ ఇతర నెట్ వర్క్ కు అయినా, గతంలో మాదిరిగానే అపరిమితంగా మాట్లాడుకోవచ్చని, ఎటువంటి అదనపు రుసుములు ఉండవని స్పష్టం చేసింది. కాగా, మిగతా ప్రధాన టెల్కోలయిన వోడాఫోన్ ఐడియా, జియో సంస్థలు కూడా ఇదే దారిలో నడుస్తాయో? లేదో? వేచి చూడాలి.

More Telugu News