Disha: దిశకు న్యాయం కోసం కదిలిన సినీ రంగం.. ఫిలిం చాంబర్ నుంచి ఎఫ్ఎన్‌సీసీ వరకు కొవ్వొత్తుల ర్యాలీ

  • దోషులను చంపడమే కరెక్ట్: జీవిత
  • పిల్లల పెంపకంలో మార్పు రావాలి: మురళీ మోహన్
  • తల్లిదండ్రులే చంపమంటే ప్రభుత్వానికి జాలి ఎందుకో: బాబూమోహన్

మృగాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన పశువైద్యురాలు దిశకు న్యాయం జరగాలంటూ సినీ రంగ ప్రముఖులు నినదించారు. హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్ నుంచి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్‌సీసీ) వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో చిత్ర పరిశ్రమకు చెందిన 24 వృత్తుల వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవిత మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలు దురదృష్టకరమన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులను చంపడం ఒక్కటే సరైన మార్గమన్నారు.

దుబాయ్‌లో ఆడవాళ్ల వైపు చూడాలంటే భయపడతారని, అందుకు అక్కడి కఠిన చట్టాలే కారణమని ‘మా’ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ అన్నారు. మాజీ ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ.. పిల్లల పెంపకంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఘటనల్లో దోషులకు ఉరిశిక్షే సరైనదన్నారు. దోషులను రాత్రికి రాత్రే చంపేస్తే తాను ఎంతో సంతోషిస్తానని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. కాలయాపన ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.

మాజీ మంత్రి బాబూమోహన్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దోషులను వారి తల్లిదండ్రులే చంపమంటున్నా ప్రభుత్వం ఎందుకు జాలి చూపిస్తోందో తనకు అర్థం కావడం లేదన్నారు. బాధితులకు భరోసా కోసమైనా ముఖ్యమంత్రి మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. తలుపులు వేసుకుని పడుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకని బాబూమోహన్ ప్రశ్నించారు.

More Telugu News