Chandrababu: 40 ఏళ్ల అనుభవంపై రాళ్లెందుకు పడ్డాయి?: చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రశ్న

  • అఖిలపక్ష సమావేశం విజయవాడలో ఎందుకు పెట్టారు?
  • అంబేద్కర్ ఆశయాలకు బాబు తిలోదకాలు
  • అమరావతి శిల్పి కాదు.. అమరావతి దొంగ

రాజకీయాలలో తనకు అపారమైన అనుభవం ఉందని విపక్షనేత చంద్రబాబు చెప్పుకుంటారని, మరి రాజధాని పర్యటనలో 40 ఏళ్ల అనుభవంపై రాళ్లెందుకు పడ్డాయో అంటూ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఎద్దేవా చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజధాని అమరావతి అభివృద్ధిపై గొప్పలు చెప్పుకునే ఆయన అఖిలపక్షపార్టీల సమావేశం తుళ్లూరులో కాకుండా విజయవాడలో ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని సవాల్ విసిరారు.

చంద్రబాబు దళిత ద్రోహి అని, అంబేద్కర్ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వడమే కాకుండా, రాజధానిలో అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని పెడతానని కల్లబొల్లి మాటలు చెప్పి దళితులను మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు. రాజధానిపై అంత ప్రేమ ఉంటే గెజిట్ ను ఎందుకు విడుదల చేయలేదని, ఆయన హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తే లిమ్కాబుక్ లో స్థానం సంపాదించడం ఖాయమని అన్నారు.

తానేదో అమరావతి శిల్పిని అన్నట్లు మాట్లాడుతున్నారని, ఆయన అమరావతి శిల్పి కాదు.. అమరావతి దొంగ అని ధ్వజమెత్తారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో చేసిన అక్రమాలకు ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. తమ ప్రభుత్వం 119 సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువవుతుంటే ఎల్లో మీడియాకు మాత్రం అది కనపడటం లేదని ఘాటుగా విమర్శించారు.

More Telugu News