Amaravathi: రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సహకారంతో సీఎం జగన్ ముందుకెళ్లాలి: సీపీఐ నేత రామకృష్ణ

  • సీఎం జగన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
  • ఎవరు సీఎంగా వున్నా, కేంద్రం సహకారం తప్పనిసరి
  • శ్మశానంతో పోల్చుతూ మనల్ని మనం కించపరచుకోవద్దు 

రాజధాని అమరావతిపై సీఎం జగన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ నేత రామకృష్ణ సూచించారు. విజయవాడలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని గురించి కూలంకషంగా చెప్పగలిగిన వ్యక్తి మన రాష్ట్రంలో చంద్రబాబునాయుడే అని, కనుక, ఈ అఖిలపక్ష సమావేశానికి బాబును కూడా జగన్ ఆహ్వానించాలని సూచించారు.

రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలని విభజన బిల్లులో స్పష్టంగా పొందుపరిచారు, మరి నిధులు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. కనుక, కేంద్ర ప్రభుత్వంపై అందరూ కలిసి ఒత్తిడి తేవాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా ఎవరు ముఖ్యమంత్రిగా వున్నా, కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరని అభిప్రాయపడ్డారు.

రాజధాని అమరావతి విషయంలో తప్పొప్పులుంటే వాటిపై మాట్లాడాలి కానీ, వేరే ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతుల్లో, ప్రాంతీయ ఉద్యమాలకు తావిచ్చే పద్ధతుల్లో మాట్లాడటం మంచిది కాదని, ముఖ్యమైన పదవుల్లో వున్న వాళ్లు కూడా ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజధానిని శ్మశానంతో పోల్చుతూ మనల్ని మనం కించపరచుకోవద్దని, రాజధాని మనందరిదీ కనుక దాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రతిపక్షాల సహకారం తీసుకోవాలని సూచించారు. అమరావతి నిర్మాణం విషయంలో ముఖ్యంగా, సీనియర్ నేత చంద్రబాబునాయుడి సహకారం తీసుకుని సీఎం జగన్ ముందుకెళ్లాలని కోరారు.  

పార్టీ తరఫున ఒక్క అంశంలో విభేదిస్తున్నా


2050 నాటికి రెండు కోట్ల మంది ప్రజలు ఇక్కడే నివసిస్తారని, నవ నగరాలు ఇక్కడే ఉంటాయి, అభివృద్ధి అంతా ఇక్కడే వుంటుంది, రాజధానిలో అలాగే వుండాలన్న చంద్రబాబు పాయింట్ తో పార్టీ తరఫున విభేదిస్తున్నట్టు రామకృష్ణ చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయకుండా, దృష్టంతా అమరావతిపై పెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అభిప్రాయపడ్డారు.

More Telugu News