Ayyappa: అయ్యప్ప మాల ధరించిన విద్యార్థికి స్కూల్లో ప్రవేశం నిరాకరణ!

  • మాల ధరించిన చిన్నారి
  • 16 రోజులుగా లోపలికి అనుమతించని యాజమాన్యం
  • అయ్యప్పస్వాముల నిరసన

ఇది అయ్యప్ప దీక్షల సీజన్ కావడంతో ఓ చిన్నారి కూడా మాల వేసుకున్నాడు. కానీ స్కూలు యాజమాన్యం ఆ బాలుడికి ప్రవేశం నిరాకరించిన ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. భువనగిరి పట్టణానికి చెందిన చిన్నారి కొన్నిరోజుల క్రితం మాల ధారణ చేశాడు. అప్పటి నుంచి ఆ విద్యార్థికి స్కూల్లో ప్రవేశం నిరాకరిస్తున్నారు. రెండు వారాలకు పైగా ఆ చిన్నారిని స్కూలు యాజమాన్యం లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థి తండ్రి శివారెడ్డి ఇదేం అన్యాయం? అని నిలదీశారు. ఇతర అయ్యప్ప స్వాములు కూడా దీనిపై స్పందించి స్కూలు ఎదురుగా నిరసనకు దిగారు.

స్కూలు ప్రిన్సిపాల్ ను వివరణ అడగ్గా, ఇప్పుడే వస్తానని చెప్పిన ఆ ప్రిన్సిపాల్ ఎంతకీ తిరిగిరాలేదు. దాంతో అయ్యప్పస్వాముల్లో సహనం నశించి, స్కూలు ఆఫీసులో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసినా అయ్యప్పస్వాముల ఆగ్రహం చల్లారలేదు. యాజమాన్యం క్షమాపణ చెప్పాల్సిందేనని, విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News